టిజేఎసి ర్యాలికి తెరాస సర్కారే ప్రచారం?

February 21, 2017


img

ఒకప్పుడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలందరి సహకారంతో ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించిన తెరాస, అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఉద్యమాలు, పోరాటాలు పేరు చెపితే భయపడుతుండటం, పైగా వాటిని రాష్ట్ర విద్రోహచర్యలుగా ముద్ర వేసి తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

టిజెఎసి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో నిర్వహించదలచిన నిరుద్యోగ ర్యాలీకి తెరాస సర్కార్ అనుమతి నిరాకరించడమే కాకుండా, టిజెఎసికి గతంలో విద్వంసాలకు పాల్పడిన చరిత్ర ఉందని, దానికి వామపక్ష తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని హైకోర్టులో వాదించడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు అదే టిజేఎసి, అవే వామపక్షాల సహకారం తీసుకొని తెరాస వాటితోనే కలిసి పనిచేసింది. ఇప్పుడు అవి తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సవాలు విసురుతున్న కారణంగా వాటిపై ‘విద్రోహశక్తులు’ అనే ముద్రవేయడం చాలా శోచనీయం. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసుల సాయంతో తెలంగాణా ఉద్యామాలను అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించిన తెరాస ఇప్పుడు సరిగ్గా అదే పని చేస్తుండటం విశేషం. 

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అభిప్రాయలు, నిరసనలు తెలియజేయడానికి సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. కానీ వీలులేదని తెరాస నేతలు వాదిస్తున్నారు. ఈ ర్యాలీ తెరాస సర్కార్ పై యుద్దప్రకటన కాదని, కేవలం తమ డిమాండ్లను ప్రభుత్వం, ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్ళడమేనని టిజేఎసి చెపుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ టిజేఎసి అధ్వర్యంలో నిరుద్యోగులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకొంటామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తున్నప్పుడు కూడా వారు సంఘవిద్రోహశక్తులు అన్నట్లు తెరాస నేతలు వాదించడం చాలా శోచనీయం. అది ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నమేనని తెరాస నేతలు వాదించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.  

ఈ నిరుద్యోగుల ర్యాలీకి తెరాస సర్కార్ ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా వెంటనే అనుమతించి ఉండి ఉంటే, బహుశః దీనికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడి ఉండేదే కాదు. కానీ తెరాస సర్కార్ దీనిపై అనవసరంగా, చాలా అతిగా రాద్దాంతం చేస్తుండటం వలననే తెరాస సర్కార్ ఈ రెండున్నరేళ్ళలో కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? ఏఏ శాఖలలో ఎన్ని ఖాళీలున్నాయి?వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు?వంటి గణాంకాలు, వివరాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ సమస్యపై చాలా లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై తెరాస నేతలు టీవీ చర్చలలో పాల్గొన్నప్పుడు ఎంత గట్టిగా వాదించినా కళ్ళ ముందు కనబడుతున్న ఈ గణాంకాలు వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్నాయి. 

అయితే నిరుద్యోగ ర్యాలీకి ఇప్పుడు ప్రభుత్వం, హైకోర్టు అనుమతించినా, నిరాకరించినా పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే, ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో టిజేఎసి ఇప్పటికే విజయవంతం అయ్యింది. దాని ఒత్తిడి కారణంగానే ఇప్పుడు తెరాస సర్కార్ హడావుడిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ సమస్యపై మీడియాలో జరుగుతున్న చర్చలు టిజేఎసి ప్రయత్నాలు ఫలించాయని చెప్పడానికి మరో మంచి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

తెరాస సర్కార్-టిజెఎసి మద్య జరుగుతున్న ఈ వివాదం ద్వారా మరో విషయం కూడా బయటపడింది. ప్రజాసమస్యలపై తెరాస సర్కార్ ను ఎవరూ ప్రశ్నించకూడదు...ప్రశ్నిస్తే వారు రాష్ట్ర ద్రోహులుగా ముద్రవేయబడతారు..తెలంగాణా కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ అయినా అందుకు మినహాయింపు కాదు..అని స్పష్టం అయింది. తెరాస సర్కార్ యొక్క ఈ నిరంకుశ వైఖరి ప్రజలలో దానిపట్ల వ్యతిరేకత ఏర్పడేందుకు దోహదపడుతుందని చెప్పక తప్పదు. 


Related Post