హనుమాన్‌.. 50 రోజుల పండుగ... ఎన్నేళ్ళకెన్నేళ్ళకు!

March 02, 2024
img

వాళ్ళిద్దరికీ నెరిసిన గుబురు గడ్డాలు లేవు. కనుక ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ కారు. కానీ ఇద్దరూ కలిసి ‘హాఫ్ సెంచరీ’ కొట్టి తెలుగు సినీ పరిశ్రమకు కానుకగా అందించారు. వారే ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా. 

కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్‌’ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలతో పోటీకి దిగింది. అవన్నీ కలెక్షన్స్ లెక్కలు కట్టుకొని వయా ఓటీటీ మీదుగా వెళ్ళిపోయాయి. కానీ హనుమాన్‌ మాత్రం ప్రేక్షకుల అభిమానం సంపాదించుకొని 150 థియేటర్లలో 50 రోజులు ఆడింది. కొత్త సినిమాలు రాకపోతే ఇంకా ఆడుతూనే ఉండేది కూడా. 

ఒకప్పుడు ఏఎన్ఆర్‌, ఎన్టీఆర్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, చిరంజీవి సమయంలో చాలా సినిమాలు 50రోజులు, 100 రోజులు ఆడుతుండేవి. అది తెలుగు సినీ పరిశ్రమలో స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. 

ఇప్పుడు థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, సినిమాల బడ్జెట్‌ నానాటికీ పెరిగిపోతూనే ఉంది. ఏళ్ళ తరబడి సినిమాలు తీస్తేనే గొప్ప సినిమా... కలెక్షన్స్ మాత్రమే సినిమా విజయానికి కొలమానం అనుకొనే రోజులు వచ్చాయి. 

కానీ థియేటర్లలో ఇలా కనీసం 50 రోజులు ఆడగల సినిమాలు తీయాలనే ఆలోచన ఇండస్ట్రీలో పెద్దలు ఎవరికీ కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఈ ఇద్దరు కుర్రాళ్ళు తక్కువ బడ్జెట్‌తో తక్కువ రోజులలోనే అద్భుతమైన సినిమా తీసి చూపడమే కాకుండా, థియేటర్లలో 50 రోజులు ఆడించవచ్చని నిరూపించి చూపారు. 

ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మన చిత్ర పరిశ్రమలో 50 రోజుల సినిమా పండుగ జరుపుకొని చాలా ఏళ్ళయింది. మళ్ళీ మా హనుమాన్‌ సినిమాతో ఈ పండగ జరుపుకోగలగడం మాకు చాలా ఆనందం కలుగుతోంది. 

ఇది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న వేడుక కాదు. ఇది చూసి ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలందరూ కూడా స్పూర్తి పొందాలనేదే మా కోరిక. ఈ సినిమా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌కి మంచి బలమైన పునాది వేసింది. కనుక అందరూ మెచ్చుకొనేలా సినిమాలు తీయడానికి గట్టిగా కృషి చేస్తాను,” అని చెప్పాడు.   

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తన తర్వాత సినిమా ‘జై హనుమాన్’ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది హనుమాన్‌కు రీమాస్టర్ వెర్షన్ అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్-లుక్ పోస్టర్‌ రిలీజ్ చేస్తాము. హనుమాన్‌ క్లైమాక్స్ సీన్ ఎంత అద్భుతంగా ఉందో, జైహనుమాన్‌ సినిమా రెండున్నర గంటలు అంతే అద్భుతంగా ఉండేలా తీసి చూపిస్తాను,” అని చెప్పాడు. 

Related Post