బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేసిన పెద్ది సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్స్ వేసుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.
అలాగే టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు కూడా పెద్ది నిర్మాతని అనుమతించింది. పెద్ది రేపు జూన్ 4న విడుదల కాబోతోంది కనుక రేపటి నుంచి పది రోజుల పాటు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ పది రోజులు రోజుకి 5 షోలు వేసుకునేందుకు అనుమతించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నేటి రాత్రి స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.600, రేపటి నుంచి మల్టీప్లేక్స్ థియేటర్లలో రూ.125, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది.
పెద్ది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు మద్య టికెట్ ఆదాయం పంచుకునే విషయంలో వివాదం ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకొని ఈ నెలాఖరు వరకు పాత అద్దె పద్దతిలోనే పెద్దితో సహా అన్ని సినిమాలు ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్స్ అంగీకరించడంతో ఆ సమస్య తాత్కాలికంగా ముగిసింది.
పెద్ది టికెట్ ఛార్జీల పెంపు కోరుతూ చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో నిర్మాత హైకోర్టుకి వెళ్తే ఆ కేసు విచారణని 6వ తేదీకి వాయిదా వేయడంతో కేసు వాపసు తీసుకున్నారు. కానీ ప్రభుత్వమే సానుకూలంగా స్పందించి జీవో జారీ చేయడంతో పెద్దికి ఆటంకాలన్నీ తొలగిపోయాయి.
కనుక పెద్ది పహిల్వాన్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాత్రే ప్రీమియర్స్ చూసేందుకు అవకాశం కల్పించడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే థియేటర్ల వద్ద వారి హడావుడి మొదలైపోయింది.