పవన్ కళ్యాణ్‌ ఇంట్లో సమావేశానికి అనుమతించం: అద్దంకి దయాకర్

June 02, 2026


img

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జనసేన పార్టీ ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ నిర్వహించాలనుకున్నారు.

కానీ వివిధ కారణాల చేత పోలీసులు అనుమతి నిరాకరించారు. కనుక సభ నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరుతూ జనసేన తెలంగాణ విభాగం ఈరోజు ఉదయం  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది.

అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదంటూ హైకోర్టు రిజిస్ట్రీ జనసేన పిటిషన్‌న్ని తిరస్కరించింది.

కోర్టు అనుమతించకపోతే సభనిరద్దు చేసుకుంటామని, సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్‌ నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పింది.

కానీ దానినీ అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం విప్ అద్దంకి దయాకర్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌ ఈరోజు నగరంలో ఏమాత్రం హడావుడి చేసినా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కనుక ఇంట్లో ప్రెస్‌మీట్‌ కూడా అనుమతించలేమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.


Related Post