తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్‌

June 02, 2026


img

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పోరాటాల స్పూర్తితో తెలంగాణలోనే జనసేన ఉద్భవించిందన్నారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే....  

సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ "నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం. 

తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు. తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. 

ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. 

భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. 

ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది. 

ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది.

 గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి. 

తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది.

12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై తెలంగాణ!
జై హింద్!



Related Post