కాంగ్రెస్‌ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? పవన్ ప్రశ్న

June 02, 2026


img

జనసేన పార్టీ అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు: 

మీ కాంగ్రెస్‌ నేత ఒకరు పాకిస్తాన్‌ జిందాబాద్ అంటే మీకు తప్పుగా అనిపించలేదు. అప్పుడు శాంతిభద్రతల సమస్యలు రాలేదు. కానీ నేను హైదరాబాద్‌ వస్తే వస్తాయా?

మీ రాహుల్, సోనియా గాంధీలు కేరళ, మెదక్ ఎక్కడి నుంచయినా పోటీ చేయోచ్చు. కానీ నేను తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదా? మీది జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ వలన ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది.  ప్రాంతీయవాదంతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను.     

ఈ పార్టీలు, నాయకులు ఇంతకాలం తెలంగాణ ప్రజలని మభ్యపెడుతూ పదవులు, అధికారం, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుని బాగా డబ్బు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ తెలంగాణలో నిరుపేదల గురించి ఎన్నడైనా ఆలోచించారా? వాళ్ళని ప్రాంతీయవాదంతో రెచ్చగొడుతూ మీ పబ్బం గడుపుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? 

మీరు ఎన్ని తిట్లు తిట్టినా, బెదిరించినా మేము మాట్లాడకూడదా? మాట్లాడితే తప్పా?

ఏపీలో నా పీక కోసేస్తామని బెదిరింపులు వస్తేనే భయపడలేదు. ఇక్కడ మీ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడను. జనసేనలో ఎవరూ భయపడరు.

అధికారంలో ఉన్నాము కదా అని నా గోశాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. అదొక లీగల్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ. అనుమతి లేకుండా లోని ప్రవేశించి ఏదో చేయాలని చూస్తే చాలా సెక్షన్స్ కింద కేసులు పెట్టాల్సివస్తుంది. కనుక ప్రభుత్వ పెద్దలు బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ నేను ఎక్కడైనా కబ్జా చేశానని నిరూపిస్తే ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించేసేందుకు నేను సిద్దం... అంటూ పవన్ కళ్యాణ్‌ దుమ్ము దులిపేశారు.  


Related Post