పాపం జన నాయగన్!

January 27, 2026


img

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు అడ్డుపడటంతో నిలిచిపోయింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించినా నేటికీ దానికి విముక్తి లభించనే లేదు. 

మద్రాస్ హైకోర్టులో సింగిల్ జడ్జ్ ‘జన నాయగన్’కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసి విడుదలకు సహకరించమని ఆదేశించారు. దీనిని సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసి నేటికి వాయిదా వేసింది. కనుక ఇక ‘జన నాయగన్’ విడుదల చేసుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతిస్తుందని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా వారికి మరో షాక్ ఇచ్చింది. ఈ కేసుని మళ్ళీ సింగిల్ జడ్జీకి బదిలీ చేసింది. సెన్సార్ బోర్డు వాదనలు కూడా వినిపించేందుకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. 

అంటే ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లే. అక్కడ సింగిల్ జడ్జ్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మళ్ళీ ‘జన నాయగన్’కు అనుకూలంగా తీర్పు చెపితే సెన్సార్ బోర్డు మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేస్తుంది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే సినీ నిర్మాణ సంస్థ హైకోర్టు డివిజన్ బెంచ్‌ లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించక తప్పదు. కనుక ‘జన నాయగన్’కు ఇప్పట్లో సెన్సార్ బోర్డు, ఈ కోర్టుల నుంచి విముక్తి లభించే అవకాశం లేనట్లే! 



Related Post

సినిమా స‌మీక్ష