బుధవారం సాయంత్రం నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదలవుతుంది. రెండేళ్ళకోసారి జరిగే ఈ మహాజాతరకు సుమారు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. కనుక ఆ రద్దీని తట్టుకోలేమని భావిస్తున్నవారు దాదాపు నెల రోజులుగా మేడారం వస్తూనే ఉన్నారు. వనదేవతలని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు.
మేడారం జాతరకు తెలంగాణ నలుమూలల నుంచి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే తొలిసారిగా న్యూజిలాండ్ దేశానికి చెందినా మావోరి అనే గిరిజన తెగకు చెందిన బృందం మేడారం జాతరలో పాల్గొనేందుకు వచ్చారు.
వారి ఆచారం, సాంప్రదాయం ప్రకారం తమ భాషలో వారు పాటలు పాడుటూ వనదేవతలను ప్రార్ధించారు. మంత్రి సీతక్క చొరవతో అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఈ బృందం తమ సంప్రాదాయ పద్దతిలో పాట పాడుతూ ‘హకా నృత్యం చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, “మేడారం జాతరలో వన దేవతలను పూజించడం అంటే ప్రకృతిని పూజించి గౌరవించడమే. ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత యావత్ మానవాళికీ ఉంది.
మా దేశంలో మేము ఈవిధంగా ప్రకృతితో మమేకం అవుతుంటాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా వనదేవతలను పూజించడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది.
ప్రకృతికి ప్రతిరూపాలుగా వెలిసిన సమ్మక్క సారలమ్మ వన దేవతలకు మేము కూడా మా గిరిజన సాంప్రదాయంలో ఈవిధంగా ప్రార్ధించే అవకాశం లభించినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది,” అని చెప్పారు.
( Video Courtesy: Chota News App)