ముంజేతి కంకణాన్ని చూసుకునేందుకు అద్దమెందుకు అన్నట్లు ఒక సినిమా హిట్ అయ్యిందో లేదో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు కూడా. సినిమా బాగుంటేనే థియేటర్లలో నిలబడుతుంది లేకుంటే లేదు. శేఖర్ కమ్ముల కుబేర సినిమా అలా నిలబడింది. దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అది చాలా సహజం.
కానీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి ఎక్కడా ఒక్క మాట వినపడటం లేదు. అటువంటి ఓ భారీ బడ్జెట్ సినిమా విడుదలైన తర్వాత ‘మీడియా సైలన్స్’ చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కన్నప్ప విడుదలకు ముందు జారీ చేసిన ‘లీగల్ చర్యల’ హెచ్చరికే ఇందుకు కారణం అయ్యుండవచ్చు.
ఈ ‘మీడియా సైలన్స్’ నిర్మాతలు మోహన్ బాబు, మంచు విష్ణులకు చాలా ఉపశమనం కలిగించి ఉండవచ్చు. కుబేర సూపర్ హిట్ అని జనం కూడా నిర్ధారించేశారు. కానీ కన్నప్ప విషయంలో ఆ మాట గట్టిగా ఎందుకు వినపడటం లేదంటే ‘మీడియా సైలన్స్’ అని చెప్పవచ్చు.
వారం రోజుల వ్యవధిలో విడుదలైన ‘కుబేర’ గురించి అందరూ ఇంతగా మాట్లాడుకుంటునప్పుడు, కన్నప్ప విషయంలో ‘మీడియా సైలన్స్’ వలన ఆ సినిమా థియేటర్లలో ఉందనే విషయం ఎవరికీ తెలియకుండా పోయే ప్రమాదం ఉంది.
సరే హిట్ సినిమాల గురించి చర్చ పక్కన పెడితే, ఆరు నెలల క్రితం విడుదలై బోర్లా పడిన ఓ పెద్ద సినిమా గురించి విమర్శలు, ఆరోపణలు, వాదోపవాదాలు, అభిమానుల హెచ్చరికలు, నిర్మాతల క్షమాపణల పర్వం నేటికీ కొనసాగుతుండటం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
ప్రతీ రంగంలో అనేక సమస్యలుంటాయి. అలాగే సినీ పరిశ్రమలో కూడా. కానీ సినిమాలపై సామాన్య ప్రజలకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది కనుక సినీ పరిశ్రమ అందరికీ ‘సాఫ్ట్ టార్గెట్’గా ఉంటోంది. దానిలో చిన్న చిన్న సమస్యలు కూడా భూతద్ధంలో చూసినట్లు పెద్దవిగా కనబడుతుంటాయి. ఒకవేళ అలా కనపడకపోతే ఎవరో ఒకరు కనిపించేలా చేస్తూ పబ్బం గడుపుకుంటారు. దాని వలన అంతిమంగా నష్టపోయేది సినీ పరిశ్రమే తప్ప బయట వ్యక్తులు కారు.
కనుక సినీ పరిశ్రమలో వారే ఎక్కువ సంయమనం పాటించాల్సి ఉంటుంది. కానీ వారు మనుషులే కనుక అప్పుడప్పుడు ఏదో మాట్లాడితే మరేదో జరిగిపోతుంటుంది. ఇదే అంతే అనుకోని ముందుకు సాగిపోవడం మంచిది.