ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి జనం బాగా అలవాటుపడ్డారు. వాటి ఛార్జీలు కాస్త ఎక్కువే అయినా థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నందున, ఓటీటీలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ముఖ్యంగా కేబిల్ టీవీ ఛానల్స్‌లో, డిష్ టీవీ ఛానల్స్‌లో వాణిజ్య ప్రకటనలు ఉంటాయి. కానీ ఓటీటీలో ఉండవు. కనుక మద్యలో ప్రకటనల గోల లేకుండా హాయిగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ చూడవచ్చనే ప్రజలు ఛార్జీలు కాస్త ఎక్కువైనా భరిస్తున్నారు.
ఓటీటీల సామ్రాజ్యంలో అమెజాన్ ప్రైమ్‌కి మంచి ఆదరణ, లక్షలాదిమంది సభ్యులు ఉన్నారు. కానీ జూన్ 17 నుంచి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో మరిన్ని మంచి సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఒకవేళ ఇప్పటిలాగే వాణిజ్య ప్రకటనలు లేకుండా చూడాలనుకుంటే అదనంగా కొంత రుసుము చెల్లించాలని తెలిపారు. వాణిజ్య ప్రకటనలు ఉన్నా పర్వాలేదనుకునేవారు ప్రస్తుతం చెల్లిస్తున్న రుసుముతో కొనసాగవచ్చని తెలిపారు.
డిష్ ఛానల్స్ లో వాణిజ్య ప్రకటనలు భరించలేకనే చాలా మంది ఓటీటీలకు మారారు. కానీ ఇప్పుడు ఓటీటీలలో కూడా వాణిజ్య ప్రకటనలు తప్పనిసరి అయితే అప్పుడు ప్రజలు వేరే ఆప్షన్స్ ఉంటే వాటికి మారుతారు. కనుక వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే రాబడి కంటే కోల్పోయే వినియోగదారుల వలన నష్టమే ఎక్కువగా ఉండవచ్చు.