కార్తికేయ 1,2 సినిమాలతో టాలీవుడ్ యువహీరో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. కానీ తర్వాత చేసిన ‘స్పై’ నిరాశ మిగిల్చింది. దాని తర్వాత భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో మొదలుపెట్టిన సోషియో ఫాంటసీ సినిమా స్వయంభూ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో నెల రోజులలో ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ తర్వాత మరో రెండు లేదా మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి జూన్-జూలై నెలల్లో స్వయంభూ విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నందున షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పక్కాగా పూర్తి చేసిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్వయంభూ సోషియో ఫాంటసీలో నిఖిల్ ఓ యోధుడుగా నటిస్తుండటంతో మార్షల్ ఆర్ట్స్, గుర్రపుస్వారీ, కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా నభా నటేష్ నటిస్తోంది. ఆమె కూడా చాలా శక్తివంతమైన పాత్ర చేస్తుండటంతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది.
టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా స్వయంభూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, డైలాగ్స్: వాసుదేవ్ మున్నెప్పగారి చేస్తున్నారు.