మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ మొదలుపెట్టి అప్పుడే రెండేళ్ళు కావస్తోంది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
కన్నప్ప అనగానే ఆనాడు కృష్ణంరాజు చేసిన భక్త కన్నప్ప సినిమా అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా గురించి వెల్లడిస్తున్న పాత్రలు, వివరాలు చూస్తుంటే, భక్తిభావానికి బదులు వీరోచితగాధగా అనిపించక మానదు. ఇలా ఊహించడం తొందరపాటే అవుతుంది కనుక ఏప్రిల్ 25 న సినిమా విడుదలయ్యే వరకు చూడాల్సిందే.
ఈ సినిమాలో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సీనియర్ నటులు నటిస్తున్నారు. శివపార్వతులుగా కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ నటిస్తుండగా, నందీశ్వరుడుగా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతీదేవి రూపంలో ఉన్న కాజల్ అగర్వాల్ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు.
కైలాసంలో మంచు కొండలపై కూర్చొని అభయహస్తం ఇస్తున్నట్లు చూపారు. ఆమె చూడముచ్చటగా ఉన్నప్పటికీ హిందువుల మనసులో ముద్రించుకున్న నెత్తిన బంగారు కిరీటం, ఒంటి నిండా నగలతో పార్వతీదేవి రూపంలో కనిపించకపోవడం కాస్త నిరాశ కలిగిస్తుంది. ఈ సినిమాలో మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు కూడా నటించారు.