హనుమాన్ సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంశలు అందుకున్న ప్రశాంత్ వర్మ, శనివారం దసరా పండుగని పురస్కరించుకొని నిన్న మరో కొత్త సినిమా ప్రకటించాడు. పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్ డేట్ దగ్గర పదేవరకు సినిమా పేరు ప్రకటించలేకపోతుంటే, ప్రశాంత్ వర్మ తన ప్రతీ సినిమాకి ముందుగానే పేరు ప్రకటించి ప్రారంభిస్తుండటం విశేషం.
అతను కొత్తగా మొదలుపెట్టబోతున్న సినిమా పేరు ‘మహాకాళి’ అని ట్విట్టర్‌లో ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, ఆర్‌కేడీ స్టూడియోస్ కలిసి ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ మహాకాళి సినిమాని నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ వర్మ కాదు పూజ కొల్లూరు.
‘హనుమాన్’ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సిరీస్‌లో ‘జై హనుమాన్’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. అది పూర్తికాక మునుపే నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తూ మరో సినిమా చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో సినిమా మహాకాళిని ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ జోరు చూస్తుంటే ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నట్లనిపిస్తుంది.