మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబం అధ్వర్యంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోడలు ప్రీతి రెడ్డి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్. మల్లారెడ్డి కాలేజీలలో తరచూ ఏదో ఒక సినిమా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్ జరిగింది.
ఆ కార్యక్రమంలో ఆమె విద్యార్ధులను ఉద్దేశ్యించి, “మీరందరూ ఆదర్శ కుటుంబం సినిమా చూడాలనుకుంటున్నారా? ఆ సినిమా చూసేందుకు సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నారా? అయితే మీరు నాకు ఓ మాట ఇవ్వాలి. మీరందరూ తప్పకుండా ఆదర్శ కుటుంబం సినిమా చూస్తానంటే నేను కాలేజీకి సెలవు ప్రకటిస్తా,” అని అన్నారు.
సినిమా చూసేందుకు కాలేజీకి సెలవు ఇస్తామని యాజమాన్యమే చెపుతుంటే విద్యార్ధులు వద్దంటారా?అందరూ సంతోషంగా ‘ఓకే’ చెప్పేశారు.
ఆమె కూడా చాలా సంతోషిస్తూ ‘అక్టోబర్ 30న కాలేజీకి సెలవు’ అని ప్రకటించేశారు.