పాల్వంచలో ఆఫీస్ సిబ్బంది వేధింపులతో మేనేజర్ ఆత్మహత్య!

October 18, 2026


img

పై అధికారులు వేధింపులతో మహిళా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు చూశాము. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్ గోడౌన్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) ఓ మహిళా ఉద్యోగి, ఇతరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. 

తన కార్యాలయంలో ఎవరూ లంచాలు తీసుకోకుండా కట్టడి చేస్తుండటంతో ఓ మహిళ ఉద్యోగి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాంటూ తప్పుడు ఆరోపణలు చేశారని సూసైడ్ లెటర్‌లో వ్రాశారు. ఆమె భర్త, మరో ఇద్దరు టీవీ న్యూస్ రిపోర్టర్లతో కలిసి రోజూ తనని వేధిస్తుండటంతో అవి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వాట్సప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు. తన మరణానికి వారే కారణమని, దీనిని తన మరణ వాంగ్మూలంగా పరిగనించి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అనంతుల లక్ష్మీనారాయణ కోరారు. 

తాను ఏ తప్పు చేయనప్పటికీ ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ అంతర్గత కమిటీతో విచారణకు ఆదేశించడం తనకు చాలా బాధ కలిగించిందని దానిలో పేర్కొన్నారు. తాను భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఫలానా లాడ్జిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ మెసేజ్ పంపి ఫ్యానుకు ఇరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

అది చూసి ఆయన సహోద్యోగులు, పోలీసులను వెంటబెట్టుకొని ఆ లాడ్జికి చేరుకోగా, అప్పటికే లక్ష్మీనారాయణ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. 



Related Post