బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, కొందరికి కఠిన శిక్షలు విధించారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు, అసలు ఎలిమినేషనే లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. షాలిని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించినప్పటికీ, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపినట్లు తెలుస్తోంది.
ముందుగా కెప్టెన్‌గా గెలిచిన రామ్ ప్రసాద్‌ను నాగార్జున అభినందించారు. అనంతరం హౌస్‌లో బట్టల విషయంలో జరిగిన గొడవపై కంటెస్టెంట్లను నిలదీశారు.
నీతూ నటరాజ్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి, ఆట ఆడటానికి వచ్చావా? లేక ఇతరులకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చావా? అంటూ హెచ్చరించారు. హౌస్‌లో గ్రూపులుగా ఏర్పడి నామినేషన్లపై ముందుగానే చర్చించుకున్న వ్యవహారాన్ని కూడా బయటపెట్టారు.
అమన్, షాలిని, రోహిత్ కలిసి ఎవరిని నామినేట్ చేయాలనే విషయంపై మాట్లాడుకున్న వీడియోను నాగార్జున హౌస్‌మేట్స్‌కు చూపించారు. గతంలోనూ హెచ్చరించినా మార్పు రాలేదని షాలినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ల విషయంలో ముందస్తు ప్రణాళికలు వేసినందుకు ఈ ముగ్గురికీ వచ్చే వారం కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. ఇతర పోటీల్లోనూ పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఇక త్రిగుణ్‌పై షాలిని చేసిన వ్యాఖ్యల వీడియోను చూపించి ఆమెను నిలదీశారు. త్రిగుణ్‌కు క్షమాపణ చెప్పించారు. నీతూతో గొడవ విషయంలోనూ షాలినికి అక్షింతలు వేశారు. మొత్తంగా ఈసారి బిగ్‌బాస్-10 ఊహించని విధంగా సాగిందనే చెప్పాలి.