తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఈ నెల 10 నుంచి మొదలయ్యి నేడు అదివారం సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగియనున్నాయి. రాష్ట్రంలో మహిళలు సద్దుల బతుకమ్మకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించుకొని తమ ఆటపాటలతో నేడు ఘనంగా వీడ్కోలు పలుకనున్నారు.
హైదరాబాద్, ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబోతోంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. వారితో పాటు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు కూడా పాల్గొని వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలతో తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఈ ముగింపు వేడుకలకు సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరవుతారు.
కనుక ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేయబోతున్నారు. కనుక వేరే మార్గాలలో గమ్యస్థానాలు చేరుకోవలసిందిగా నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.