తెలంగాణలో మాదక ద్రవ్యాల కట్టడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈగల్ టీమ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా తరచూ ఎక్కడో అక్కడ పట్టుబడుతూనే ఉన్నాయి.
మాదక ద్రవ్యాలు కట్టడి కోసం నేడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “ఇకపై కళాశాల ప్రాంగణంలో డ్రగ్స్ లభించినా లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలను యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు తేలినా ఆయా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకుంటాము. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు తప్పనిసరి చేయబోతున్నాము.
యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసుకొని కళాశాలలో మాదక ద్రవ్యాల కట్టడికి అందరూ కృషి చేయాలి. క్యాంపస్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
కళాశాలల్లో చేరే సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని అంగీకార పత్రాలు తీసుకునే విధానాన్ని కూడా అమలు చేయాలి. అవసరమైతే దీని కోసం ప్రభుత్వం సహాయసహకారాలు తీసుకుంటాము.
ఇప్పటికే డ్రగ్స్‌కి అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటాము. ముందుగా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాము,” అని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ డ్రగ్స్ సమస్య యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అరికట్టేందుకు పోలీసులతో పాటు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.