హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు అవసరమైన అనుమతులు, రుణం విషయంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్య జోరుగా రాజకీయాలు సాగుతుండటం ఆసక్తికరంగా ఉంది. మెట్రో రెండో దశ విస్తరణ పనులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నందున మెట్రో విస్తరణకు వీలైనంత త్వరగా నిధులు, అనుమతులు సాధించుకొస్తారని ఆశిస్తే అడ్డుపడుతుండటం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ అంశంపై సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. తాజాగా మళ్ళీ మరో లేఖ వ్రాశారు. “ఈ నెల 22,23 తేదీలలో నేను ఢిల్లీలో ఉంటాను. కనుక మీరు దయచేసి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లయితే ఇద్దరం కలిసి మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి అన్ని విషయాలు ఆయనతో చర్చిద్దాము. దీనికి సంబంధించి అన్ని పత్రాలు, రికార్డులు, ఒప్పంద పత్రాలు తీసుకు వస్తాను. వాటిని చూపించి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు కోరుదాము. రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి రుణం మంజూరు గురించి కూడా చర్చిద్దాము. కేంద్ర మంత్రిగా మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి లేఖ సారాంశం. దీనిపై కిషన్ రెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి తదుపరి టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి రావడమే అని ప్రధాని మోడీ స్పష్టం చేయడమే ఈ మెట్రో రాజకీయాలకు కారణం అయ్యుండవచ్చు.