మోడీని కలిసింది బిజేపిలో చేరడానికి కాదట!

April 24, 2026


img

ఇటీవల బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సకుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత వారు ప్రధాని మోడీ, బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాల, కిషన్ రెడ్డిలతో కలిసి ఫోటోలు దిగారు. వారు హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఒక్కరే బిజేపి కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. కనుక వారి కుటుంబం బిజేపిలో చేరబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. 

కానీ తాను, తమ కుటుంబ సభ్యులు బిజేపిలో చేరబోవడం లేదని ప్రీతి రెడ్డి చెప్పారు. బిజేపిలో చేరేందుకు తాము ప్రధాని మోడీని కలవలేదని, తమ కాలేజీలలో ‘సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం’లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించేందుకు వెళ్ళామని ప్రీతి రెడ్డి చెప్పారు. తన మావగారు మల్లారెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటారని, పార్టీ మారే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు.      

కానీ వర్తమాన రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్నవారికి కూడా ఇలాంటి కుంటి సాకులతో భేటీలు దేనికో తెలుసు. కనుక ముందుగా ఆమె బిజేపిలో చేరడం, ఆ తర్వాత ఎన్నికలకు ముందు మల్లారెడ్డి కూడా బిజేపిలో చేరడం ఖాయమనే భావించవచ్చు. 



Related Post