నాడు కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె వారి పట్ల ఎంత కటినంగా, దుర్మార్గంగా, నిర్దయతో వ్యవహరించారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఆ సమ్మె సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆర్టీసీ కార్మికులందరికీ ఇంకా బాగా తెలుసు.
సమ్మె ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ వారిని ఉక్కుపాదంతో అణచి ఉంచారు. ఆ భయంతోనే మళ్ళీ ఎన్నడూ సమ్మె చేయలేదు.
ప్రభుత్వం మారిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో రెండున్నరేళ్ళు ఆర్టీసీ కార్మికులు చాలా ఓపికగా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మళ్ళీ సమ్మెకు దిగారు.
నాడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించామో మరిచినట్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు మొసలి కన్నీళ్ళు కార్చుతూ వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారిప్పుడు.
ఆర్టీసీ కార్మికులని కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసి గవర్నర్‌కు పంపారని, కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం విలీనం కోసం ‘అపాయింటడ్ డేట్’ ప్రకటిస్తే సరిపోతుందని వాదిస్తున్నారు.
విలీనం అయితే ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీత భత్యాలు పెరుగుతాయని సుద్దులు చెపుతున్నారు.
ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదు కదా? కానీ ఎందుకు అమలుచేయడం లేదని మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించి వారికి అండగా ఉంటుందన్నారు.
చచ్చినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనని నాడు కేసీఆర్ ఖరాఖండీగా చెప్పారు. కానీ విలీనం ప్రక్రియని దాదాపు పూర్తి చేశారని కేటీఆర్ చేపుతున్నారిప్పుడు.
నాడు 55 రోజుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు ఆర్ధిక సమస్యలతో అల్లాడిపోతూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేటీఆర్, తలసాని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వారికి అండగా నిలబడతామంటున్నారు!
నాడు ఆర్టీసీని మూసేస్తానని కేసీఆర్ కార్మికులను బెదిరిస్తున్నప్పుడు, కేటీఆర్‌తో సహా ఏ ఒక్కరూ కేసీఆర్‌ని వారించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తోందని, కానీ ఏ ఒక్క మంత్రికి సిఎం రేవంత్ రెడ్డిని నిలదీసే ధైర్యం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే. చేయకపోవడం తప్పే.
కనుక సిఎం రేవంత్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్‌లా వ్యవహరించకుండా వారితో నేరుగా సమావేశమయ్యి పరిస్థితి వివరించి సమయం కోరి ఉంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేసేవారు కారేమో?
కనీసం ఇప్పటికైనా వారితో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కాగలిగితే పరిష్కారం లభించినా లభించకపోయినా మానవతా దృక్పదంతో వ్యవహరించారనే మంచి పేరు లభిస్తుంది.
మంచో చెడో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కనుక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో గుర్తుచేసుకొని వారికి దూరంగా ఉంటే మంచిది. వారిని నమ్ముకుంటే ఆర్టీసీ కార్మికులే నష్టపోతారు.