ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

April 24, 2026
img

వరంగల్ జిల్లా, నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజున (గురువారం) బస్టాండ్ వద్ద కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నప్పుడు  డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ హటాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.

సాటి కార్మికులు వెంటనే మంటలు ఆర్పి వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. కానీ 80 శాతం పైగా కాలిన గాయాలతో అయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నందున వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో వద్ద గల అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ మృతి చెందారు. 

అయన మృతదేహాన్ని నర్సంపేట తరలించారు. శంకర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ కారణంగా సాటి ఆర్టీసీ కార్మికులు బాధ, తీవ్ర ఆవేశంతో ఉన్నారు. ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకు వెళ్ళి ఆందోళన చేయాలనుకున్నారు. కానీ పోలీసులు వారిని శాంతింపజేసి ఆ ఆలోచన విరమింపజేశారు. మరికొద్ది సేపట్లో ఖానాపురం మండలంలోని ముత్తోజీపేటలో అయన అంత్యక్రియలు జరుగబోతున్నాయి.

ఆర్టీసీ కార్మికులు నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. కనుక ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో సహా నర్సంపేట డిపో వద్ద భారీగా పోలీసులను మొహరించారు. శంకర్ గౌడ్‌కు భార్య  లత, కుమారుడు హేమంత్, కుమార్తె షామిలి ఉన్నారు. 

Related Post