ప్రముఖ జానపద గాయని మంగ్లీ-లాయర్ సుబ్బారావు మద్య జరుగుతున్న వివాదం నిన్న మరో మలుపు తిరిగింది. ఆయన కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ఆమె కూడా ఆయనపై పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ వివాదం గురించి మీడియా ప్రతినిధులకు వివరించారు.
ఆమె ఏమన్నారంటే, “లాయర్ సుబ్బారావు భరతనాట్యం వగైరా నేర్చుకున్నారు. సినిమాలలో నటించాలని చాలా తాపత్రయపడుతున్నాడు. అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నాడు. ఏదో విధంగా పాపులర్ అయ్యేందుకు నన్ను టార్గెట్ చేసుకున్నాడు. ఆయన చెపుతున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీ, దాని వ్యవహారాలతో నాకు సంబంధమే లేదు.
బంజారా జాతి నుంచి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న నేను క్షణం తీరిక లేకుండా నా పాటల ప్రపంచంలోనే బతుకుతున్నాను. ఇంత పేరు, ఇంత డబ్బు సంపాదించుకుంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తానని ఎలా అనుకున్నారు? నాకు డబ్బు సంపాదించాలనే యావ ఉండి ఉంటే ఈ స్థాయికి ఎదిగేదానినే కాదు.
నాతో రోజూ వందల మంది ఫోటోలు దిగుతుంటారు. అనేక మంది అభిమానంతో ఆహ్వానిస్తే నేను వారింటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తాను. కనుక నాతో ఇంత పరిచయం ఉందని చాలా మంది సంతోషంగా చెప్పుకుంటారు. కానీ అంతమాత్రాన్న నా పేరు చెప్పుకొని ఎవరెవరో చేసే తప్పుడు పనులకు నేనెలా బాధ్యురాలినవుతాను? నా పేరు చెప్పుకొని ఎవరెవరో ఏదో తప్పుడు పనులు చేస్తుంటే ఆ విషయం నాకెలా తెలుస్తుంది?
ఎవరో ఏదో చేస్తే వాటికి నేను సంజాయిషీలు ఇచ్చుకోవాలంటే నేను పాటలు పాడటం మానేసి ఇదే పని మీద ఉండాలి. అది సాధ్యం కాదు కనుక నాపై వచ్చే ప్రతీ విమర్శ, ఆరోపణకి నేను సమాధానాలు చెప్పలేను.
కానీ ఈ వ్యవహరం పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. దీంతో నా ప్రతిష్ట, నా కుటుంబం గౌరవ మర్యాదలకు భంగం కలుగుతోంది కనుక నేను కూడా పోలీస్ స్టేషన్‌కు రాక తప్పలేదు.
నాపై కేసు పెట్టిన సుబ్బారావు తనకి నేను డబ్బిస్తే ఈ కేసులో నా పేరు లేకుండా చేస్తానని చెప్పాడు. అంటే డబ్బు కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అర్ధమవుతూనే ఉంది కదా? నేను ఏ తప్పు చేయనప్పుడు అతనికి డబ్బు ఎందుకివ్వాలి? మైక్రో ఫైనాన్స్ కంపెనీ బాధితుల గురించి నేను తెలుసుకున్నాను. వారి బాధ నాకు అర్దమైంది. నేను కూడా వారి తరపున పోరాడుతాను.
ఒకవేళ నేను తప్పు చేసినట్లు భావిస్తే ఆ వివరాలు బయటపెట్టి నన్ను నిలదీయండి. లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డబ్బు కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న సుబ్బారావు సంగతి మీరే తేల్చండి. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా నా గురించి లేనిపోని వార్తలు వ్రాయోద్దని మీడియా మిత్రులను అభ్యర్ధిస్తున్నాను,” అని మంగ్లీ అన్నారు.