ఓ పక్క క్యాంప్ రాజకీయాలు... మరోపక్క ప్రమాణ స్వీకారాలకు ఏర్పాట్లు

February 14, 2026


img

మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాక ‘హంగ్’ ఏర్పడింది. కనుక కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులు, మజ్లీస్, వామపక్ష సభ్యుల మద్దతుతో వాటిని దక్కించుకునేందుకు తెర చాటున ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. 

అవి ఆ ప్రయత్నాలలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న 7 కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలలో గెలిచిన అభ్యర్ధుల చేత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్‌లను పరోక్ష పద్దతిలో ఎంపిక చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ ఎన్నికల ప్రక్రియలో గెలిచిన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పాల్గొంటారు.  స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 

ఆరోజు ఉదయం ముందుగా గెలిచిన సభ్యులందరూ ప్రమాణస్వీకారాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముందుగా మేయర్, చైర్ పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వేదికపై జిల్లా కలెక్టర్ లేదా ఆయన సూచించిన గెజిటెడ్ అధికారి ఈ ఎన్నికల ప్రక్రియని ఆయా కార్పోరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాలలో నిర్వహిస్తారు. ఈ ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకుగాను వీడియో చిత్రేకరిస్తారు. కలెక్టర్ అనుమతిస్తే ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

ఈ పదవులకు పోటీ చేసేవారి పేర్లను గెజిటెడ్ అధికారి ప్రకటించి వారికి మద్దతు తెలపాలనుకునేవారు చేతులు ఎత్తాలని సూచిస్తారు. అప్పుడు వారిని లెక్కించి ఆ వివరాలు రికార్డ్ చేస్తారు. అత్యధిక మంది సభ్యుల మద్దతు పొందినవారిని మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్లుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 

ఒకవేళ ఏ కారణం చేతయినా మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక పూర్తికాకపోతే డిప్యూటీ మేయర్, డిప్యూటీ  మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నిక జరుగదు. 

ఒకవేళ ఇద్దరు అభ్యర్ధులు పోటీ పడి ఇద్దరికీ సమానంగా ఓట్లు లభిస్తే లాటరీ పద్దతిలో విజేతని ఎంపిక చేస్తారు.


Related Post