తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించినట్లే తమ పార్టీ కోణంలో స్పందించారు.
“కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంచిపెట్టి, ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికలను అపహాస్యం చేశారు. మరోపక్క బిజేపి కూడా ప్రజలని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. అయినప్పటికీ వారి ప్రలోభాలు, ఒత్తిళ్ళకు తలొగ్గకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మా గులాబీ శ్రేణులు కూడా కాంగ్రెస్, బిజేపి ఒత్తిళ్ళు తట్టుకుంటూ వీరోచితంగా పోరాడి మంచి ఫలితాలు సాధించాయి.
గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే, వాటిలో 122 బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు, బిజేపి, మజ్లీస్ చెరో రెండు మాత్రమే గెలుచుకోగాలిగాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము 13 మున్సిపాలిటీలు గెలుచుకున్నాము.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపిలతో పోరాడే శక్తి, వాటిని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఈ ఎన్నికలతో మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ శ్రీరామ రక్ష,” అని కేటీఆర్ అన్నారు.