హైడ్రాకు హైకోర్టులో ఎప్పుడూ మొట్టికాయలే.. వై?

February 12, 2026


img

హైడ్రాకు హైకోర్టులో మరోసారి మొట్టికాయలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నార్సింగ్‌లోని 300-303, 306-311, 313-315 సర్వే నం.లలో 1,608 చదరపు గజాల స్థలంలో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి.

వాటి యాజమాన్య హక్కులపై వివాదం ఉంది. హైకోర్టులో ఆ కేసు విచారణ సాగుతోంది. కనుక తుది తీర్పు వెలువడే వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని హైకోర్టు చాలా కాలం క్రితమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

కానీ హైడ్రా అధికారులు తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆ స్థలం చుట్టూ నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ కూల్చేసి కంచె ఏర్పాటు చేసి, బోర్డు పెట్టిందని గొర్ల రాహుల్ యాదవ్ మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్‌, కోర్టు విచారణలో ఉన్న ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ హైడ్రా ఎందుకు కూల్చివేసింది? ఏ అధికారంతో కూల్చివేసింది? అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైడ్రా తరపు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తప్పు పట్టారు. ఒకవేళ ఆక్రమణలు తొలగించాలన్నా ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా? కానీ ఇచ్చారా? ఇవ్వకాపోతే ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.

కనీసం పురపాలక శాఖ కార్యదర్శి అనుమతి కూడా తీసుకోకుండా హైడ్రా ఏకపక్షంగా ఇలా వ్యవహరించడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కనుక హైడ్రా ఏర్పాటు చేసిన ఆ కంచెను, బోర్డుని తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారాన్ని ఈ నెల 24కి వాయిదా వేసింది. 


Related Post