తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు జరుగబోతోంది. ఇటువంటి సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు పరిధిలో చందాపూర్ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బిజేపి అభ్యర్ధి మహాదేవప్ప (48) ఈ రోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలింగ్ ముందు రోజు జరిగిన ఈ ఘటనతో మక్తల్‌లో కలకలం చెలరేగింది.
తన భర్తని ప్రత్యర్ధి పార్టీలకు చెందినవారు సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతుండటం వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని మహదేవప్ప భార్య సత్తెమ్మ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అనుచరుల వేధింపుల వల్లనే మా పార్టీ అభ్యర్ధి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనని తక్షణం పార్టీలో నుంచి తొలగించి విచారణ జరిపించాలి. లేకుంటే మా కార్యకర్తల ఆగ్రహం తట్టుకోలేదీ ప్రభుత్వం. మహాదేవప్ప కుటుంబానికి బిజేపి అండగా ఉంటుంది. అయన కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడుతాము,” అని అన్నారు.