సూర్యాపేట గురుకుల పాఠశాలలో అమ్మాయిలు జంప్!

February 07, 2026


img

అవును. సూర్యాపేట(డి) జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలికలు అర్ధరాత్రి గేటు దూకి, బయట తమ కోసం బైకులపై వచ్చిన ఇద్దరు అబ్బాయిలతో రాత్రంతా బయట గడిపారు. మళ్ళీ తెల్లావారుజామున వారిద్దరూ అదే అబ్బాయిలతో తిరిగివచ్చి గేటు దూకి హాస్టల్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యింది. ఆ సిసి ఫుటేజి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ ఆడపిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారంటే దానర్ధం వారు పేద కుటుంబాల నుంచి వచ్చినవారని. అయినప్పటికీ వారి తల్లితండ్రులు చదువుకోమని వారిని పాఠశాలకు పంపిస్తే, ఆ పిల్లలు ఈవిధంగా అర్ధరాత్రిపూట అబ్బాయిలతో బయట గడపడం చాలా తప్పు. ఆ అబ్బాయిలు కూడా యుక్తవయసులో ఉన్నవారే. చదువు కుదరకపోతే ఉద్యోగం, ఉపాధి మీద దృష్టి పెట్టాల్సినవారు ఈవిదంగా మైనర్ బాలికలను ముగ్గులో దింపి వారిని ప్రోత్సహించి అర్దరాత్రి బయటకు తీసుకువెళ్ళడం చాలా తప్పు. ఇందుకు ఆ బాలికలను పాఠశాల నుంచి టీసీ ఇచ్చి పంపించేస్తే వారి చదువులు అక్కడితో ఆగిపోతాయి. ఇద్దరు అబ్బాయిలు పోలీసు కేసులో చిక్కుకుంటే వారి భవిష్యత్‌ కూడా అంధకారంగా మారుతుంది. 

ఈ వ్యవహారంలో హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ ప్రమేయం ఉండి ఉంటే వారి ఉద్యోగాలు ఊడకమానవు. ఒకవేళ వారి ప్రమేయం లేకపోయినా అర్ధరాత్రి ఇద్దరు మైనర్ అమ్మాయిలు గేటు దూకి అబ్బాయిలతో బయటకు వెళ్ళినందుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు. 


Related Post