తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్‌లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మరో మూడు నెలల్లోగా మా రాజకీయ పార్టీ ఏర్పాటవుతుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టాము. మంచి ముహూర్తం చూసుకొని పార్టీని ప్రారంభిస్తాము,” అని చెప్పారు.
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఈ ఎన్నికలలో గెలుపు చాలా కీలకం. ఇటువంటి సమయంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదని, కనుక బీసీలు కాస్త ఆలోచించుకొని ఓట్లు వేయాలని సూచించారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి వేయవద్దని సూచిస్తున్నట్లే. బీఆర్ఎస్ పార్టీకి వద్దంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలని సూచిస్తున్నారా?
బీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు (కేటీఆర్, హరీష్ రావు) ఇద్దరూ ఎన్నికల ప్రచారాన్ని సీరియగా తీసుకున్నట్లు లేరని, పార్టీని గాలికొదిలేసి హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. వారిద్దరూ రాష్ట్ర స్థాయి నాయకులే కదా? మరి ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న చేప నిందితుడు ప్రణీత్ రావుపై చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద చేపల వంటి సూత్రధారులను విడిచిపెట్టేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసి దోషులకు శిక్షలు పడేలా చేయాలని కల్వకుంట్ల కవిత అన్నారు.