పెళ్ళితోనే ఇల్లు... కట్నం కాదు సుమా!

February 06, 2026
img

ఈరోజుల్లో మధ్యతరగతి పెళ్ళంటే కనీసం 25-30 లక్షలు తప్పనిసరి. అదే ఐటి ఉద్యోగాలు చేస్తున్నవారైతే మరో 25-30 లక్షలు కలుపుకోవలసిందే.

రెండు కుటుంబాలను కలిపే పెళ్ళి వేడుక అందరికీ ఆనందం కలిగించవచ్చు. కానీ అవసరం లేని ఈ ఆర్భాటాలతో ఆడపిల్ల తల్లితండ్రులపై పడే భారం అంతా ఇంతా కాదు. 

ఇన్ని లక్షలు ఖర్చు చేసి పెళ్ళి చేసినా వారు జీవితాంతం కలిసి ఉంటారో లేదో గ్యారెంటీ ఉండదు. ఒకవేళ ఉన్నా నూతన దంపతులు పెళ్ళి తర్వాత ఫర్నీచర్, బైకు, కారు, సొంత ఇల్లు అన్నీ అమర్చుకోవడానికి వారు జీవిత కాలం కష్టార్జితం అంతా ఈఎంఐల రూపంలో చెల్లించుకోక తప్పదు. 

ఇవన్నీ అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ యధాశక్తిన వాతలు పెట్టుకొని బాధతోనే జీవిస్తున్నారు. 

కానీ ఉత్తరాది రాష్ట్రంలో ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ కొత్త ఇంట్లో నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎందుకంటే, మావగారు అల్లుడికి కట్నంగా ఆ కొత్త ఇల్లు ఇవ్వలేదు. నూతన దంపతులు తమ పెళ్ళి ఖర్చులతో ఆ కొత్త ఇల్లు కొనుకున్నారు కనుక!

లక్షల రూపాయలు ఖర్చు చేసి అట్టహాసంగా పెళ్ళి చేసుకోవడం కంటే ఆ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కుంటే జీవితాంతం నిశ్చింతగా, హాయిగా ఆ ఇంట్లో జీవించవచ్చని పెళ్ళి కొడుకు పెద్దలకు, కాబోయే భార్యకు నచ్చజెప్పాడు. అందుకు వారు అంగీకరించడంతో ఇరు కుటుంబాలు వారి పెళ్ళికి ఖర్చు చేయదలచిన డబ్బుతో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. 

ఆ కొత్త ఇంట్లోనే ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా వారి వివాహం జరిగింది. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్ళి ఖర్చుతో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం గొప్ప ఆలోచనే కదా? 

         


Related Post