ఫిరాయింపుల కేసు: మూడు వారాల తర్వాత

February 06, 2026


img


బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సంజయ్ కరోల్‌ కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు వింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్పీకర్‌ ఇప్పటికే 8 మంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకొని వారికి క్లీన్ చిట్ ఇచ్చారని, మిగిలిన ఇద్దరినీ కూడా ప్రశ్నించి నిర్ణయం తీసుకునేందుకు మరో మూడు వారాలు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న అభిషేఖ్ సింఘ్వీ కోరారు. 

బీఆర్ఎస్‌ పార్టీ తరపున వాదిస్తున్న మోహిత్ రావు గడువు పొడిగింపు అవసరం లేదంటూ అభ్యంతరం చెప్పారు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేశారు. ఆమె తరపున కడియం ఎన్నికల ప్రచారం చేశారు. కనుక వారిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలునందున వారిపై అనర్హత వేటు వేయడానికి ఇంకా ఆలస్యం దేనికని  మోహిత్ రావు వాదించారు.  

కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే చివరిసారి మళ్ళీ వాయిదాలు కోరవద్దు. ఒకవేళ మూడు వారాల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కేసు నమోదు చేయాల్సివస్తుందని  హెచ్చరించింది. 

కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ ఇద్దరికీ ఇటీవలే స్పీకర్‌ నోటీసులు పంపించారు. వారు వివరణ తీసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తారు. 



Related Post