గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. దానిలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి బిజేపి, బీఆర్ఎస్ పార్టీల తీరుని, వాటి నేతల తీరుని ఎండగట్టారు.
“కాళేశ్వరం ప్రాజెక్టుని బీఆర్ఎస్ పార్టీ ఏటిఎంలా వాడుకొని వేలకోట్లు పోగేసుకుందని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలే ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మేము జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ చేత విచారణ జరిపించాము. సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ వ్రాస్తే పట్టించుకోలేదు. ఎందువల్ల? బిజేపి-బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం కనుకనే.
మనుషులు మరొకరి ప్రాణాలు కాపాడేందుకు అవయవదానం చేస్తున్నట్లే, తెలంగాణలో బిజేపిని కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ ఓట్లు, సీట్లు దానం చేస్తుంటుంది. అందుకు ప్రతిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురినీ జైలుకి వెళ్ళకుండా బిజేపి కాపాడుతుంటుంది. వారిపై ఇన్ని కేసులు నమోదు చేసినా ఇంతవరకు ఏ ఒక్క కేసులో వారిని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుకుంటోంది.
తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే, కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది. అందరూ వేలకోట్లు పోగేసుకున్నారు. వందల ఎకరాలలో ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు. కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోయారు.
తమ హయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దానిలో పేద ప్రజల కోసం ఖర్చు చేసింది ఎంత? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?
కేసీఆర్ అభివృద్ధి పేరుతో నిలువునా దోచుకొని రాష్ట్రాన్ని దివాలా తీయించి ఫామ్‌హౌసులో పడుకుంటే, మా ప్రభుత్వం ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతోంది,” అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదీ ఫెవికాల్ బంధం. వాళ్ల శరీరాలు వేరైనా తలకాయ ఒక్కటే.
— Telangana Congress (@INCTelangana) February 5, 2026
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.@revanth_anumula #BRSBJP#UnitedAgainst pic.twitter.com/WxmEnuXwHr