మేడారం హుండీల ఆదాయం లెక్కింపు షురూ

February 06, 2026
img

ఇటీవల ఘనంగా ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చిన లక్షలాది మంది భక్తులు హుండీలలో నగదు, వెండి బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ వనదేవతలకు కానుకలుగా సమర్పించుకున్నారు. ఆ హుండీలన్నిటినీ హనుమకొండలోని టిటిడీ కళ్యాణ మండపానికి తరలించారు. గురువారం మంత్రి కొండా సురేఖ ఆ హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. 

మేడారం జాతరలో మొత్తం 828 హుండీలు  ఏర్పాటు చేశారు. వాటిలో ముందుగా 125 హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం రూ. 2,49,65,000 నగదు లభించింది. హుండీలలో ఎప్పుడో రద్దు చేసిన 1,000, 500 నోట్లు కూడా భక్తులు వేశారు. కొందరు భక్తులు తమ ప్రేమ ఫలించాలంటూ వ్రాసిన లేఖలు, తమ ఆస్తి వివాదాలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు హుండీలలో వేశారు.  

ఇదేవిధంగా రోజుకి 100-125 హుండీలు చొప్పున మిగిలిన  703 హుండీల ఆదాయం లెక్కించడానికి దాదాపు వారం పది రోజులు పడుతుందని ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఈ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయశాఖ డిప్యూటీ కమీషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామి పర్యవేక్షించారు.

Related Post