భారత్ ఆయుధ సామర్ధ్యానికి నిలువెత్తు నిదర్శనం అగ్ని-3 క్షిపణి. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగి 17 మీటర్ల పొడవు, 1500 కేజీల బరువున్న ఈ అగ్ని-3 క్షిపణి సుమారు 3,000 కిమీ దూరంలో లక్ష్యాలను అవలీలగా చేదించగలదు.
ఈ క్షిపణులు ఇప్పటికే భారత్ సైన్యం ఆయుధాల జాబితాలో ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఒడిశాలోని చాందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి అగ్ని-3 క్షిపణిని ఆర్మీ అధికారులు, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు కలిసి మరోసారి పరీక్షించారు. ఈసారి మొబైల్ లాంచింగ్ ప్యాడ్ (వాహనం)పై నుంచి బంగాళాఖాతంలో నిర్దిష్ట లక్ష్యంపై ప్రయోగించగా అది గురి తప్పకుండా లక్ష్యాన్ని చేదించింది.
బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ఈ క్షిపణి ప్రయోగాన్ని నిశితంగా పరిశీలించి అత్యంత ఖచ్చితత్వంతో అగ్ని-3 క్షిపణి లక్ష్యాన్ని చేదించిందని ధ్రువీకరించాయి.
దీనిపై రక్షణశాఖ స్పందిస్తూ, “ఇది సాధారణ శిక్షణ, యుద్ధ సన్నదత పరీక్షలో భాగంగానే ప్రయోగించామని, ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని తెలియజేసింది.
భారత్ అగ్ని-3 క్షిపణి ప్రయోగం చేస్తే అది తమని సవాలు చేసినట్లుగానే పాక్ భావిస్తుంది. కనుక అది కూడా త్వరలో క్షిపణి ప్రయోగం చేయడం ఖాయమే.