ముస్లింలను కాదు మజ్లీస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాం: బండి

February 07, 2026


img

కరీంనగర్ బిజేపి ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ శుక్రవారం కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “మా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతం పేరుతో ముస్లింలను మోసం చేస్తున్న మజ్లీస్ పార్టీనే వ్యతిరేకిస్తున్నాము. 

ముస్లింలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్న మజ్లీస్ అధినేతలు భారీగా ఆస్తులు పోగేసుకున్నారు. కానీ పాత బస్తీలో నిరుపేద ముస్లింల పరిస్థితి నేటికీ ఆలాగే ఉంది. 

ఓవైసీ సోదరులు కనీసం పాతబస్తీలో రోడ్లు కూడా వేయించలేదు. వారే ముస్లింలను వాడుకుంటూ మోసం చేస్తున్నారు. అందుకే వారిని, వారి పార్టీని అక్కడి ముస్లింలు కూడా తిరస్కరిస్తున్నారు. 

కానీ బిజేపి ‘సబ్ కే సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో  దేశంలో అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలు మాట్లాడే ప్రజలను కలుపుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తోంది. అది హిందువులకు ఒక్కరికే కాదు కదా?ముస్లింలతో సహా దేశంలో అన్ని మతాలవారికి ఇస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలు దేశంలో అన్ని మతాలవారికీ అందుతున్నాయి. అలాగే రోడ్లు వగైరా అభివృద్ధి ఫలాలు దేశం ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారు. కనుక బిజేపి హిందువుల పార్టీ అని అనుకోవడం తప్పు. 

బిజేపి మన అందరి పార్టీ. కనుక మున్సిపల్ ఎన్నికలలో బిజేపికే మీరందరూ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

పదేళ్ళ బీఆర్ఎస్‌ పాలనలో ఎంత అవినీతి అక్రమాలు జరిగాయో అందరూ చూశారు. గత రెండున్నరేళ్ళుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏవిధంగా సాగుతోందో చూస్తున్నాము. కనుక ఆ రెండు పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దు. బిజేపిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరీంనగర్‌ని అభివృద్ధి చేసి చూపిస్తా,” అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.


Related Post