నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదట మొదటి అంతస్తులో మంటలు మొదలయ్యి వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక వాహనాలతో హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది. సమాచారం అందగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేతా, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పోలీసులతో అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అగ్ని ప్రమాదం సంభవించగానే లోపల పనిచేస్తున్న సిబ్బంది అందరూ భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. కానీ పలు కీలక కేసులకు సంబంధించి ఫైల్స్ భద్రపరిచిన కంప్యూటర్లన్నీ ఈ అగ్నిప్రమాదంలో కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.
డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ, “మంటలు పూర్తిగా ఆర్పెస్తే కానీ అగ్ని ప్రమాదంలో ఏమేమి కాలిపోయాయో చెప్పలేము. ప్రాధమిక దర్యాప్తు జరుపకుండా ఇప్పుడే ఏమీ చెప్పడం సరికాదు,” అన్నారు.