ఆధార్ కార్డ్ ఉంటే పౌరసత్వం లభించినట్లు కాదు: సుప్రీంకోర్టు

November 27, 2025


img

సుప్రీంకోర్టు భారతీయ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలలో నకిలీలను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం చేప్పట్టింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వారి తరపున సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. 

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జాయా మాల్య బాగ్చీ ధర్మాసనం నేడు ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, “భారతీయ పౌరసత్వానికి ఆధార్ కార్డ్ ప్రూఫ్ కానే కాదు. అది కేవలం సంక్షేమ పధకాలు పొందేందుకు గుర్తింపు కార్డు మాత్రమే. 

కానీ ఆధార్ కార్డుని కూడా దుర్వినియోగం చేస్తూ అది చూపించి దేశంలో జొరబడిన విదేశీయులకు రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఇచ్చేద్దామంటే న్యాయవ్యవస్థలు చూస్తూ కూర్చోవాలా? విదేశేయులకు కూడా ఓటు హక్కు కల్పించాలా? ఈసీ అటువంటి వారిని గుర్తించి రికార్డులలో నుంచి తొలగిస్తే ఎలా వ్యతిరేకిస్తారు?” అని సూటిగా ప్రశ్నించింది. 

కానీ ఈ సాకుతో ఈసీ ఓటర్ల జాబితాలో నుంచి పేర్లు తొలగిస్తూంటే సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా లభించిన ఓటు హక్కుకి భంగం కలుగుతుందని కపిల్ సిబాల్ వాదించారు. ఈ కేసులో ఈసీని డిసెంబర్‌ 1వ తేదీ లోగా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ అప్పటికి విచారణ వాయిదా వేసింది.


Related Post