తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు ఏడాదిగా స్తబ్దుగా ఉండిపోయింది. దాంతో ఈ కేసు కూడా రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా అటకెక్కిపోయిందనే ప్రజలు భావిస్తున్నారు. కానీ హటాత్తుగా దానిలో మళ్ళీ కదలికలు మొదలయ్యాయి. మాజీ సిఎం కేసీఆర్ వద్ద ఓఎస్‌డీగా చేసిన రాజశేఖర్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు సుమారు రెండు గంటల సేపు ప్రశ్నించారు.
విశేషమేమిటంటే కేసీఆర్ హయంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించిన వీసీ సజ్జనార్, ఇప్పుడు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనే ఈ కేసు పురోగతిని అడిగి తెలుసుకొని ఈ కదలిక తెచ్చారు. ఇకపై వేగంగా విచారణ జరపాలని సిట్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నిందితులలో ఒకరైన మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసినప్పుడు, రిమాండ్ రిపోర్టులో ‘బీఆర్ఎస్ పార్టీ అధినేత’ (కేసీఆర్)కి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంతో సీఐడీ అధికారులు అందుకు సన్నాహాలు చేస్తున్నారు. కనుక ఈ రెండు కేసుల విచారణ మళ్ళీ వేగవంతమైతే, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీకి ఆందోళన తప్పక పోవచ్చు.