తెలంగాణ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్

November 26, 2025


img

తెలంగాణ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం వెలువడింది. డిసెంబర్‌ 11,14,17 తేదీలలో పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మూడు రోజులూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణీ కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున మంగళవారం నుంచే రాష్ట్రంలో 31 జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని ఎన్నికల కమీషనర్ రాణీ కుముదిని సూచించారు. 

మూడు విడతలలో సాగే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ఈవిదంగా ఉంది... 

డిసెంబర్‌ 11న జరిగే తొలి విడత ఎన్నికలకు రేపు (గురువారం) నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. వెంటనే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే వారి నుంచి నవంబర్‌ 29 వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. డిసెంబర్‌ 1న వినతుల స్వీకరణ, 2న పరిష్కారం, 3న నామినేషన్స్ ఉపసంహరణ, వెంటనే బరిలో ఉన్న అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తారు.

 మొదటి విడతలో 189 మండలాలలోని  4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. 

 డిసెంబర్‌ 14న జరిగే రెండో విడత ఎన్నికలకు నవంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. అదే రోజు నుంచి డిసెంబర్‌ 2 వరకు నామినేషన్స్ స్వీకరణ, డిసెంబర్‌ 3న వినతుల స్వీకరణ, 4న పరిష్కారం, 5న నామినేషన్స్ ఉపసంహరణ, అభ్యర్ధుల ప్రకటన. 

రెండో విడతలో 193 మండలాలలోని  4,333 గ్రామాలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.   

డిసెంబర్‌ 17న జరిగే మూడో విడత ఎన్నికలకు డిసెంబర్‌ 3న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 5 వరకు నామినేషన్స్, డిసెంబర్‌ 6న నామినేషన్స్ పరిశీలన, 7న వినతుల స్వీకరణ, 8న పరిష్కారం, 9న నామినేషన్స్ ఉపసంహరణ, అభ్యర్ధుల పేర్లు ప్రకటన. 

మూడో విడతలో 182 మండలాలలోని  4,159 గ్రామాలు, 36,452 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. తెలంగాణలో 31 జిల్లాలలో 1,66,55,186 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 81,42,231మంది మహిళలు 85,12,455 ఇతరులు 500 మంది ఉన్నారు.  



Related Post