అవును. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారబోతోంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అవుటర్ రింగ్ రోడ్‌ని ఆనుకుని ఉన్న 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ విలీనం కోసం చట్ట సవరణలు చేయాలని నిర్ణయించారు.
ఈ విలీన ప్రక్రియ పూర్తయితే జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా మరో 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాలు చేరుతాయి. ఈ 5 జిల్లాల పరిధిలో 28 అసెంబ్లీ, 6 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కనుక హైదరాబాద్ నగర పరిధి గణనీయంగా పెరిగి దేశంలోనే అతి పెద్ద నగరంగా మారుతుంది.
దీంతో జీహెచ్ఎంసీ పరిధి, బాధ్యతలు మరింత పెరుగుతుంది కనుక జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విభజించే ప్రతిపాదన ఉంది. కానీ జీహెచ్ఎంసీ విభజనపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని జీహెచ్ఎంసీ ఏవిదంగా అభివృద్ధి చేస్తోందో, అదేవిదంగా అవుటర్‌ని ఆనుకుని ఉన్న పట్టణాలు, గ్రామాలలో కూడా అభివృద్ది జరగాల్సి ఉందన్నారు. అందుకే ఈ ప్రతిపాదనని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రస్తత విస్తీర్ణం 650 చ.కిమీ కాగా 1,403 చ.కిమీ విలీనం తర్వాత మొత్తం 2,053 చ.కిమీ అవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ జనాభా 1.45 కోట్లు కాగా విలీనం తర్వాత అది 1.70 కోట్లకు పెరుగుతుంది.
జీహెచ్ఎంసీలో విలీనం కాబోయే మేడ్చల్ జిల్లాలోని నగర పాలక సంస్థలు ఇవే: బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహర్ నగర్, నిజాం పేట.
జీహెచ్ఎంసీలో విలీనం కాబోయే మునిసిపాలిటీలు: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి.