మంత్రి కోమటిరెడ్డిపై నల్గొండ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

November 25, 2025


img

నల్గొండ కాంగ్రెస్‌ కమిటీకి పి. కైలాష్ ఇటీవలే అధ్యక్షుడుగా నియమితులయ్యారు. కానీ ఇంతలోనే ఏమయిందో తెలీదు కానీ అయన మీడియా సమావేశం నిర్వహించి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు... మంత్రి హోదాలో ఉన్న ఆయనని ‘ఒరేయ్’ అంటూ సంభోదిస్తూ మాట్లాడారు. 

ఆయన, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కలిసి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పేరు తలుచుకుంటేనే తమ రక్తం మరుగుతోందని పి కైలాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కోమటిరెడ్డి సోదరుల గురించి ఇంకా చాలా మాట్లాడారు. 

ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి లేఖ వ్రాసి తన గురించి అనుచితంగా మాట్లాడినందుకు, పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘించినందుకు ఆయనపై క్రమ శిక్షణ చర్య తీసుకోవాలని కోరారు.

అలాగే జిల్లా ఎస్పీకి కూడా లేఖ వ్రాసి, తన గౌరవం, తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా చాలా అనుచితంగా మాట్లాడినందుకు పి. కైలాష్‌పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


Related Post