ప్రభుత్వ విప్, ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేస్తున్న గంధమల రవి (36) ఆత్మహత్య చేసుకొని చనిపోవడంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. కానీ యాదగిరి గుట్ట సీఐ భాస్కర్ అధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపి గంధమల రవి అప్పుల బాధ, ఒత్తిళ్ళు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు.
గంధమల రవి, నవిత దంపతులు యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురానికి చెందినవారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వగ్రామానికి చెందినవారు కావడంతో వారిని తన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వారు ఆయన ఇంట్లోనే మేడ మీద ఓ గదిలో నివాసం ఉంటున్నారు.
అయితే గంధమల రవి తన ఆర్ధిక అవసరాల కోసం స్వగ్రామంలో తమ ఇంటిని ఓ ఫైనాన్స్ కంపెనీ వద్ద తనఖా పెట్టి ఇదివరకు రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు. గ్రామంలో మరో రూ.4 లక్షల వరకు అప్పులున్నాయి. వాటిని తీర్చలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ఇంటిని వేలం వేసేందుకు నోటీస్ జారీ చేసింది. గ్రామంలో ఇంటి గోడపై ఆ నోటీస్ అంటించింది. మృతుడి భార్య నవిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపగా, ఈ అప్పుల బాధలు, వాటి కారణంగా అవమానాలు భరించలేక గంధమల రవి శుక్రవారం రాత్రి మేడపై ఉన్న తమ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని యాదగిరి గుట్ట సీఐ భాస్కర్ తెలిపారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందిస్తూ గంధమల రవి భార్య, ఇద్దరు కుమార్తెలకు తన శక్తిమేర సాయం చేసి ఆడుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం తరపున ఆమెకు సంక్షేమ పధకాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.