ఈరోజు హైదరాబాద్ నోవాటేల్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. “పార్టీలో కొందరు మంత్రి పదవుల గురించి మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఇది నష్టం కలిగిస్తుంది. కనుక మంత్రి పదవులు గురించి ఎవరూ మాట్లాడొద్దు. మంత్రి పదవులలో ఎవరెవరిని నియమించాలో ఇప్పటికే మన అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కనుక ఎవరైనా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదు. మీరే నష్టపోతారు.
మంత్రి పదవుల గురించి ఆలోచించే బదులు ప్రతీ ఎమ్మెల్యే, మంత్రి నియోజకవర్గాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోండి. నియోజకవర్గాలలో ఏమేమి అభివృద్ధి పనులు చేపట్టాలో జాబితాలు తయారు చేసుకొని వస్తే ప్రతీ ఎమ్మెల్యేతో నేను చర్చించి అవసరమైన నిధులు సమకూరుస్తాను.
మన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా, కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు వంటి మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ, వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచే సిద్దంకండి. పార్టీ గీత దాటితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవు,” అని అన్నారు.