ఢిల్లీ సిఎం అతిశీ మార్లేనా సింగ్ రాజీనామా

February 09, 2025


img

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి అతిశీ మార్లేనా సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆమె రాజీనామా చేయడంతో ఆమాద్మీ ప్రభుత్వాన్ని, శాసనసభని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.  

ఈ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో సహా పలువురు సీనియర్ నేతలు ఓడిపోగా,  అతిశీ మార్లేనా సింగ్‌తో సహా 22 మంది మాత్రం విజయం సాధించారు. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో బీజేపి 42 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టబోతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ అమిత్ షా, సీనియర్ నేతలు నేడు ఢిల్లీలో సమావేశమై చర్చించారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, బీజేపి మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ, సీనియర్ నేతలు సతీష్ ఉపాధ్యాయ, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సూరి స్వరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. 

ప్రధాని మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నందున ఆయన 10వ తేదీన తిరిగి రాగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఖరారు చేసి వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని బీజేపి అధిష్టానం భావిస్తోంది.  


Related Post