తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్సీ వర్గీకరణ నివేదికని వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాష్ట్రంలో బీసీ సంఘాల నేతలు ఉద్యమాలకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు మాల మహానాడు నేతలు కూడా పోరాటాలకు సిద్దం అవుతున్నారు.
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు వీఎల్ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు జేఎన్ రావు, రాష్ట్ర కార్యదర్శి నక్కా దేవేందర్ రావు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి, దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి నరేష్ తదితరులు గురువారం హైదరాబాద్‌లో సమావేశమై, శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ నివేదికని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ సూచన మేరకు మందకృష్ణ మాదిగ, కిషన్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి ఎస్సీలలో మాలలని అణచివేసేందుకు ఈవిదంగా కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వలన మాదిగలు మరింత ఎక్కువ లబ్ధి పొందుతారని, మాలలు మరింత నష్టపోతారని వారు వాదించారు. కనుక తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఏఏ ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.