కుమురుం భీం జిల్లాలో మళ్ళీ పెద్దపులి దాడి!

November 30, 2024


img

కుమురుం భీం జిల్లాలో మళ్ళీ పెద్దపులి దాడి చేసింది. సిర్పూర్ టి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో శనివారం  ఉదయం సురేష్ అనే రైతు తన పొలంలో పనిచేసుకుంటుండగా హటాత్తుగా పెద్దపులి అతనిపై దూకి దాడి చేసింది. చుట్టు పక్కలున్న రైతులు పెద్దగా కేకలు వేయడంతో పెద్దపులి పారిపోయింది. పెద్దపులి దాడిలో సురేష్ తీవ్ర గాయాల పాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. 

గ్రామస్తులు వెంటనే అతనిని స్థానికి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దపులి దాడి గురించి మళ్ళీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి తక్షణం దానిని పట్టుకోకపోతే అటవీశాఖ కార్యాలయం ఎదుటే బైటాయించి ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. 

శుక్రవారం ఉదయమే కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోరే లక్ష్మి (21) అనే రైతు కూలి పొలంలో పత్తి పూలు ఏరుతుంటే పెద్దపులి దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని ఈడ్చుకుపోయింది. చుట్టుపక్కల పనిచేస్తున్న రైతుకూలీలు పెద్దగా కేకలు పెట్టడంతో పెద్దపులి లక్ష్మిని విడిచి పారిపోయింది. కానీ ఆమె గొంతు కొరకడం వలన ఆస్పత్రికి తీసుకువెళుతుండగానే దారిలో కన్ను మూసింది. ఈ విషాద ఘటన జరిగి 24 గంటలు కాక ముందే మళ్ళీ పెద్దపులి రైతుపై దాడి చేయడంతో గ్రామస్తులు ఇళ్ళలో నుంచి బయటకు రావాలంటేనే గజగజ వానికిపోతున్నారు. 

అటవీశాఖ అధికారులు, సిబ్బంది బోను, పరికారాలతో అక్కడకు చేరుకొని పెద్దపులి కోసం గాలిస్తున్నారు. గ్రామస్తులు అందరూ అవసరమైతే తప్ప ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. బోను ఏర్పాటు చేసి పెద్దపులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.    



Related Post