యాదాద్రి అయ్యింది మళ్ళీ యాదగిరి గుట్ట!

November 08, 2024


img

యాదాద్రి  శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. కనుక కేసీఆర్‌ హయాంలో ‘యాదగిరి గుట్ట’గా ఉన్న ఆలయాన్ని సుమారు రూ.600 కోట్లతో పునర్నిర్మించి ‘యాదాద్రి’గా నామకరణం చేశారు. అయితే నేడు స్వామివారిని దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, ఆలయం పేరుని మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆలయ బోర్డులతో సహా అన్ని రికార్డులలో ‘యాదగిరి గుట్ట’గా మార్చాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 

‘యాదగిరి గుట్ట’ నిర్వహణ కోసం తిరుమల దేవస్థానం బోర్డులాగే యాదగిరి గుట్ట పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. వాటిలో గుట్టపై గోశాలలో ఆవుల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రత్యేకమైన పాలసీ రూపొందించాలని సూచించారు.

దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపైనే నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా అవసరమైన వసతి ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. బ్రహ్మోత్సవాలనాటికి స్వామివారి ఆలయ గోపురానికి బంగారు తాపటం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆలయ అభివృద్ధి పనులలో ఇంకా పూర్తిచేయవలసినవి ఉంటే వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, దీని కోసం వారం రోజులలోగా నివేదిక, ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. పెండింగ్ పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తానని సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.


Related Post