నిర్మాణంలో ఉన్న సుంకీశాల పంప్ హౌస్‌లోకి సాగర్ జలాలు ప్రవేశించకుండా నిర్మించిన 40 అడుగుల ఎత్తైన గోడ కూలిపోవడంతో దానిపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆ గోడ కూలిపోయిందంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు, సుంకీశాల పంప్ హౌస్ మేమే కట్టామని మేరే గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? మరి మీరు కట్టిన కట్టడాలు కూలిపోతే దానికి మేమెలా బాధ్యులమవుతాము? వాటికి మా ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తున్నారు?
మీ బిఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడటం వలననే నాసిరకం నిర్మాణాలు జరిగాయి. అవి చిన్నపాటి వరదకే క్రుంగిపోతున్నాయి... కూలిపోతున్నాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఇప్పుడు సుంకీశాల పంప్ హౌస్‌లో జరుగుతున్నవి చూసిన తర్వాత మీ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులపై లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం కనిపిస్తోంది,” అని భట్టి విక్రమార్క అన్నారు.
ఇప్పటికే మేడిగడ్డ అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలలో జరిగిన లోపాలపై విచారణ జరుగుతోంది. తాజాగా సుంకీశాల పంప్ హౌస్ ఘటనపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.