కాంగ్రెస్‌ని టచ్‌ చేస్తే బిఆర్ఎస్ ఉండదు: కోమటిరెడ్డి

April 17, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ సుల్తాన్ పూర్ ఎన్నికల సభలో సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు, ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భగ్గుమన్నారు. 

ఈరోజు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా కూడా కేసీఆర్‌ అహంకారం ఇంకా తగ్గలేదు. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకుండా తుడిచిపెట్టుకుపోబోతోంది. అప్పటికైనా బుద్ధి వస్తుందేమో చూడాలి. 

మా ముఖ్యమంత్రి గురించి, మా గురించి, మా ప్రభుత్వం గురించి కేసీఆర్‌ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి, మళ్ళీ ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? అని అడుగుతున్నారు. కల్వకుంట్ల కవిత అరెస్టయ్యి జైలుకి వెళ్ళడంతో కేసీఆర్‌, కేటీఆర్‌ మతి భ్రమించిన్నట్లు మాట్లాడుతున్నారు. వారిద్దరూ కూడా చర్లపల్లి జైలుకి వెళ్ళేరోజు దగ్గరలోనే ఉంది. దానిలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ కట్టించి అక్కడే శాస్వితంగా ఉండే ఏర్పాట్లు చేసి మరీ పంపిస్తాము. 

ఏడాదిలోగా మా ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదామని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు. ఏదో విదంగా మా ఎమ్మెల్యేలలో కొందరిని ఆకర్షించి మా ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. కానీ మా ప్రభుత్వం జోలికి వస్తే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా కూకటివేళ్ళతో సహా పెకలించి పారేస్తాము. 

మా ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామని పగటి కలలు కంటూ కూర్చుంటే, మరో మూడు నెలల్లో మీ బిఆర్ఎస్ పార్టీయే మూతపడుతుందని తెలుసుకుంటే మీకే మంచిది. అప్పుడు మీ పార్టీలో మీరు ముగ్గురే మిగులుతారు, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కనీసం 12-13 సీట్లు వస్తాయని భావిస్తున్నాను,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


Related Post