ఓ కానిస్టేబుల్ విజయ గాధ

April 17, 2024


img

ఏ రాష్ట్రంలోనైనా పోలీస్ కానిస్టేబుల్స్‌కు పైఅధికారుల నుంచి నిత్యం తిట్లు, అవమానాలు భరిస్తూనే ఉంటారు, ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తల్లితండ్రులను కోల్పోయి జీవితంలో అనేక కష్టాలు అనుభవిస్తూ అతి కష్టం మీద 2013లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. 

ఆ ఉద్యోగంతో తన జీవితం చక్కబడుతుందని, తనకు ఎంతగానో సాయపడిన బామ్మకి ఇక ఏ కష్టం రాకుండా చూసుకోవచ్చని ఉదయ్ కృష్ణా రెడ్డి అనుకున్నాడు. కానీ 2018లో తనపై అధికారి (సీఐ) సాటి కానిస్టేబుల్స్ ఎదుట చాలా దారుణంగా అవమానించడంతో అది భరించలేక వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. 

ఈ చిన్నా చితకా ఉద్యోగాలలో గౌరవం లభించదని గ్రహించినా ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌ చేరుకొని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. వరుసగా మూడుసార్లు విఫలమైనప్పటికీ పట్టుదలతో కృషి చేస్తూ నాలుగోసారి వ్రాసి 780వ ర్యాంక్ సాధించాడు. 

ఈ సందర్భంగా ఆనాడు తాను పోలీస్ కానిస్టేబుల్‌గా ఎదుర్కొన్న అవమానం గురించి సోషల్ మీడియాలో బయటపెడుతూ, ఆనాడు అవమానం వలననే తనలో పట్టుదల కలిగి నేడు సివిల్స్‌కు ఎంపికయ్యేలా చేసిందని ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా పనికి రాడనుకున్న ఉదయ్ కృష్ణా రెడ్డి ఇప్పుడు కలెక్టర్ లేదా ఆ హోదాలో ఉద్యోగానికి అర్హత సాధించాడు. 

పరీక్షలో ఫెయిల్ అయ్యామనో లేదా తక్కువ మార్కులు వచ్చాయనో లేదా ప్రేమ విఫలం అయ్యిందనో ఆత్మహత్యలు చేసుకునేవారు ఉదయ్ కృష్ణా రెడ్డిలా ఆలోచించి వైఫల్యాలు, అవమానాలను విజయానికి మెట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.


Related Post